రైతు బాగుంటేనే అభివృద్ధి: మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  రైతు కుటుంబాలు బాగుంటేనే అభివృద్ధి.. అప్పుడే రాష్ట్రం, దేశం బాగుంటుంద‌ని  మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.  నిర్మ‌ల్ మండలంలోని మేడిప‌ల్లి గ్రామం, లక్ష్మణ‌చాంద మండ‌ల కేంద్రంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మొక్క‌జొన్న‌ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్టాడుతూ....తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్య‌వ‌సాయం రంగంలో అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసిందన్నారు. నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన వ్య‌వ‌సాయం రంగం  నేడు పునరుత్తేజం పొందింద‌ని తెలిపారు. అన్న‌దాత‌ల‌ను ఆదుకునే దిశ‌గా ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. దేశంలో ఎక్క‌డ లేని విధంగా రైతుబంధు, రైతు బీమా ప‌థకాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు.  రైతుల‌కు 24 గంట‌ల ఉచిత క‌రెంట్ ను ఇస్తుందని, దీని వ‌ల్ల‌ సుమారు రూ.7 వేల కోట్ల  స‌బ్సిడీ భారం ప‌డుతున్న‌ప్ప‌టికీ  రైత‌న్న‌ల మేలు కోసం ప్ర‌భుత్వమే భ‌రిస్తుంద‌ని తెలిపారు.